Tuesday, November 26, 2024

మాస్కోవా మునక వెనుక అమెరికా, రష్యా యుద్ధనౌక కదలికలపై నిఘా..

రష్యా యుద్ధనౌక మాస్కావోపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడుల వెనుక అమెరికా హస్తం ఉందా? అంటే అవుననే అంటున్నారు రక్షణరంగ నిపుణులు. ఆ నౌక కదలికలపై ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందించి దాడి చేసేలా అమెరికా ఉసిగొల్పిందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నాటోలో చేరే ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్‌ను బెదరిస్తూ రష్యా సైనిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రష్యా దాడిని వ్యతిరేకించిన అమెరికా, నాటో దేశాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోయినప్పటికీ పెద్దఎత్తున ఆయుధాలు అందిస్తూ, శత్రువును దెబ్బతీసే రహస్య సమాచారాన్ని ఇచ్చిపుట్టుకుంటున్నాయి. తెరవెనుక చేయాల్సిందంతా చేస్తున్నాయి. అందులో భాగంగాగానే నల్లసముద్రంలో మోహరించిన మాస్కోవా యుద్ధనౌక ఎక్కడ ఉంది, ఎలా దెబ్బతీయొచ్చన్న సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అమెరికా అందించింది. ఆ వెంటనే ఉక్రెయిన్‌ తన నెప్య్టూన్‌ క్షిపణులను ప్రయోగించి మాస్కోవా మునిగిపోయేలా చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా భారీ నష్టాన్నే చవిచూస్తోంది. దాదాపు 25వేలమంది సైనికులు, ప్రధానంగా మేజర్‌ జనరల్స్‌ను కోల్పోయింది. వందలాది సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌ సేనలు ధంసం చేశాయి. అయినప్పటికీ వెనక్కు తగ్గని రష్యా… మాస్కోవా యుద్ధనౌకను కోల్పోవడంతో తెల్లబోయింది. నల్లసముద్రంలో తమ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మాస్కోవా యుద్ధనౌకనుంచి ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఉక్రెయిన్‌ విరుచుకుపడింది. మొదట ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను సాధీనం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమై వెనుదిరిగిన రష్యా ఆ తరువాత తూర్పు, ఉత్తర ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి అజోవ్‌ తీరంలోని మరియపోల్‌ వంటి నగరాలపై పట్టుకోసం పోరాడుతోంది. క్రిమియాకు నేరుగా సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పరిస్థితుల్లో మాస్కోవాపై దాడి జరిగింది. అంతర్జాతీయంగా రష్యా అమసర్థతను ఈ సంఘటన చాటిచెప్పింది. దీంతో రగిలిపోయిన రష్యా ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసింది. సాధారణ పౌరులనూ ఊచకోత కోసింది. మాస్కోవాపై దాడి వెనుక అమెరికా పాత్ర గురించి ఇప్పుడు అనేక విషయాలు బయటకు పొక్కుతున్నాయి. అయితే ఈ కథనాలను అమెరికా కొట్టిపారేస్తోంది. తమకేమీ తెలీదని బుకాయిస్తోంది. కాగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించబోమని రష్యా ప్రకటించింది. కాగా క్రమటోస్క్‌ ప్రాంతంలో శుక్రవారం ఉక్రెయిన్‌ ఆయుధాగారాన్ని పేల్చివేశామని, లుషాంక్‌ ప్రాంతంలో ఎస్‌యు30, మిగ్‌ 29 యుద్ధ విమానాలను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది.

మరియపోల్‌లో వేగంగా తరలింపు ప్రక్రియ..

అజోవ్‌ తీరంలోని నౌకానగరం మరియపోల్‌పై పట్టు సాధించిన రష్యా అక్కడి అజోవత్సల్‌ స్టీల్‌ప్లాంట్‌నుంచి ప్రతిఘటన ఎదురవుతూండటంతో విరుచుకుపడుతోంది. ఆ కర్మాగారంలో చిక్కుకుపోయిన సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను తరచూ ఆటంకం కలిగిస్తోంది. కాగా అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సంస్థ, ఐక్యరాజ్య సమితి మానవతా విభాగం పదేపదే చేస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో అప్పుడప్పుడు కాల్పుల విరమణ పాటిస్తోంది. ఉక్రెయిన్‌ అధికారుల సాయంతో స్టీల్‌ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన మహిళలు, వృద్ధులు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం దాదాపు 500 మందిని రక్షించి తరలించినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. కాగా మూడోవిడత తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ శుక్రవారం ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా చెబుతున్నప్పటికీ క్షేత్రస్తాయిలో అలా వ్యవహరించడం లేదని, అజోవత్సల్‌ ప్లాంట్‌లో ఇప్పటికీ వేలాదిమంది చిక్కుబడిపోయారని, వారిని రక్షించేందుకు సహకరించాలని ఐరాస చీఫ్‌ ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement