ప్రభన్యూస్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. హైరిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం ఇటీవల నూతన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలిగేలా ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ ప్రీ ఇమ్మిగ్రేషన్‌లో ప్రత్యేక కొవిడ్ – 19 టెస్టింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
అన్ని అరైవల్ గేట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకో వాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం టెర్మినల్ అంతటా స్టిక్కర్లు, పోస్టర్లతో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పీసీఆర్ టెస్టు కేంద్రాల ఏర్పాటుపై సమాచారం ఇస్తున్నారు. ప్రయాణి కులకు మార్గనిర్దేశం చేసేందుకు పలు ప్రదేశాల్లో సైనేజ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ముందస్తు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షల బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ప్రయాణికులు తమ రాకకు ముందే టెస్టు కోసం బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హైదరాబాద్.ఎయిరో లేదా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ వెబ్‌సైట్ కొవిడ్.మ్యాప్ మైజీనోమ్. ఇన్ లింక్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పించారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం రూ.750, ర్యాపిడ్ పీసీఆర్ పరీక్ష ధర రూ.3,900గా ఉండనుంది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సోషల్ మీడియా వేదికల్లోనూ ఈ సమాచారం పొందుపరిచారు. ఆర్టీపీసీఆర్ పరీక్షను ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు నిర్వహించేలా ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital