న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో నిందితుడిగా ఉండి మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చిన మాగుంట రాఘవ సోమవారం ఢిల్లీలోని తిహార్ జైల్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించిన ఆయన సోమవారం సాయంత్రం జైలు అధికారుల ముందు లొంగిపోయారు. మద్యం పాలసీ అక్రమాలు, మనీ లాండరింగ్ కేసులో మాగుంట రాఘవను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.
దీంతో కొద్ది రోజుల క్రితం తన అమ్మమ్మ బాత్రూంలో జారిపడి తీవ్రంగా గాయపడ్డారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు వీలు కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. పిటిషన్లో 6 వారాల మధ్యంతర బెయిల్ కోరగా, ఢిల్లీ హైకోర్టు 2 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ రద్దు చేయడానికి ఒప్పుకోకపోయినా బెయిల్ పరిమితిని కుదించి జూన్ 12న లొంగిపోవాల్సిందిగా నిందితుడు మాగుంట రాఘవను ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఆయన సోమవారం జైల్లో లొంగిపోయినట్టు తెలిసింది. మరోవైపు ఆయన దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగులో ఉంది. ఇదే కేసులో మరో కీలక నిందితుడైన అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్చంద్ర రెడ్డి అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మాగుంట రాఘవను కూడా అప్రూవర్‌గా మారాల్సిందిగా దర్యాప్తు సంస్థలు సూచించినట్టు తెలిసింది. అయితే అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం.