Thursday, November 21, 2024

Big Story | మిగులు జలాలు ఏపీవే.. కృష్ణా జలాల కేటాయింపుల్లో కోతలొద్దు

అమరావతి, ఆంధ్రప్రభ : వరదలొచ్చే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో 2023-24 నీటి సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించేందుకు మరోసారి రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం నిర్వహించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమాలోచనలు చేస్తోంది. గతంలో నిర్వహించిన ఆర్‌ఎంసీ సమావేశాలు అసందిగ్ధంగా ముగియటంతో రెండు రాష్ట్రాల భిన్న వాదనలపై కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ)కి బోర్డు నివేదించింది. ట్రిబ్యునల్ అవార్డును అనుసరించే నీటి పంపకాలు చేయాలని సీడబ్ల్యూసీ కూడా సూత్రప్రాయంగా బోర్డుకు మార్గనిర్దేశం చేసిన నేపథ్యంలో ఈనెలలో మరోసారి ఆర్‌ఎంసీ సమావేశం నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.

ప్రత్యేకించి కృష్ణాలో మిగులు (వర) జలాల వినియోగాన్ని లెక్కించి ఏపీ కేటాయింపుల నుంచి మినహాయించటంపై రాష్ట్ర జలవనరుల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణాకు దిగువన ఉన్న ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం హక్కుగా సంక్రమించిన మిగులు జలాల వినియోగంతో సంబంధం లేకుండా నీటి పంపిణీ చేయాలని జలవనరుల అధికారులు గతంలో కృష్ణా బోర్డుకు స్పష్టం చేశారు. 2019-20లో శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్‌ మీదుగా ప్రకాశం బ్యారేజీ ద్వారా 798.297 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసింది. ఆ సమయంలో ఏపీ 44 టీ-ఎంసీలను నీటిని దారి మళ్ళించి సద్వినియోగం చేసుకోగలిగింది.

- Advertisement -

2020-21 నీటి సంవత్సరంలో కూడా 1,266.91 టీ-ఎంసీల వరద నీరు సముద్రంలో కలిస్తే 125.27 టీఎంసీలను నీటిని ఏపీ సాగుయోగ్యం చేసుకోగలిగింది. 2021-22, 2022-23 నీటి సంవత్సరాల్లోనూ కొంత నీటిని సద్వినియోగం చేసుకోగలిగింది. ఏపీకి హక్కుగా సంక్రమించిన వరదనీటి రూపంలోని మిగులు జలాలను లెక్కకట్టి ప్రతి సీజన్‌ లో కోతపెట్టటంపై ఏపీ అనేకసార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఏడాది 2023-24 నీటి సంవత్సరంలో అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా రాష్ట్ర పునర్విభజన సందర్భంగా అధికారికంగా కుదిరిన ఒప్పందాలను అనుసరించి నీటిని పంపిణీ చేయాలని ఏపీ కోరుతోంది. ఈ మేరకు కృష్ణా బోర్డుతో పాటు సీడబ్ల్యూసీకి ఏపీ జలవనరుల అధికారులు గతంలోనే విస్పష్టమైన నివేదిక అందించారు.

విద్యుదుత్పత్తే ప్రధాన పేచీ

నీటి వాటాల కన్నా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ లో విద్యుదుత్పత్తే రెండు రాష్ట్రాల మధ్య సంక్లిష్ట వివాదంగా మారింది. ఎగువ నుంచి వరద నీరు నిలిచిపోయిన సందర్భాల్లో శ్రీశైలం జలాశయం డెడ్‌ స్టోరేజికి చేరువైన సమయాల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేయటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఏపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదయినా శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి నియంత్రణపై విధివిధానాలు రూపొందించటంతో పాటు వాటి అమలుకు ప్రోటోకాల్‌ పాటించాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది.

తెలంగాణ కూడా కృష్ణా జలాలను ఏపీబేసిన్‌ అవతలకు తరలిస్తోందని ఆరోపిస్తోంది. గాలేరి-నగరి నుంచి హంద్రీనావాకు నీటి తరలిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తోంది. అనుమతుల్లేని ప్రాజెక్టులకూ, అందులోనూ కృష్ణా బేసిన్‌ తో సంబంధంలేని ప్రాంతాలకు నీటిని తరలించే విషయంలో ఆర్‌ఎంసీ విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించనున్న ఆర్‌ఎంసీ భేటీలో తీసుకునే నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

పవర్‌ హౌస్‌ల పర్యవేక్షణకు కమిటీ

ఖరీఫ్‌ సీజన్‌ ముమ్మరంగా సాగే జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు కృష్ణా బోర్డు నిర్దారించినా జలవిద్యుదుత్పత్తి కోసం ఎప్పటికపుడు నీటిని తోడేయటంతో వివాదం మరింత జటిలమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పవర్‌ హౌస్‌ ను పర్యవేక్షణ కోసం పర్మినెంట్‌ స్టాండింగ్‌ కమిటీ (పీఎస్‌ పీ) ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు భావిస్తోంది. ఈ మేరకు గతంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నా ఆచరణలో అమలు కాలేదు. ఈ ఏడాది ఖచ్చితంగా పీఎస్‌ పీని పటిష్టం చేయాలని బోర్డు భావిస్తోంది. పీఎస్‌ పీ మార్గదర్శకాల ప్రకారం 854 అడుగులకు దిగువన విద్యుదుత్పత్తి చేయటానికి అవకాశం లేదు. మిగతా సమయాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ 815 అడుగులకు దిగువన నీటిని తీసుకోకూడదు. అంతేకాదు..దిగువ ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడే విద్యుదుద్పత్తి చేయాల్సి ఉంటుgదని బోర్డు చెబుతోంది. కేఆర్‌ఎంబీ మార్గదర్శకాలను ఈ నీటి సంవత్సరంలో నిర్దిష్టంగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement