మాస్కో : తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని భావిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. పుతిన్ ఉదర సంబంధిత క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఉదర సంబంధిత వ్యాధికి సంబంధించి కొద్దిరోజుల క్రితం శస్త్ర చికిత్స జరిగిందని, ఉదరంలోని స్రావాలను బయటకు తీశారని రష్యాలో పేరుమోసిన జనరల్ ఎస్‌వీఆర్ చానల్ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన ఆపరేషన్ విజయవంతం అయిందని, పుతిన్ తరగా కోలుకున్నారని పేర్కొంది. అధునాత ఏఐ టెక్నాలజీ సాయంతో సర్జరీ జరిగిందని, ఆపరేషన్ జరిగిన రోజుల్లో పుతిన్ ఎటువంటి సమావేశాలకు హాజరుకాలేదని, ముందే రికార్డు చేసిన వీడియో సందేశాలతో సమీక్షలు పూర్తి చేశారని తెలిపింది.
బెలారస్ అధ్యక్షుడితోను, రష్యా విదేశాంగ మంత్రితోను, ఐరాస్ చీఫ్‌తోను భేటీ సందర్భంగా పుతిన్ తీవ్ర అసౌకర్యానికి గురైన విషయం తెలిసిందే. బల్లను ఓ చేత్తో గట్టిగా పట్టుకుని కూర్చోవడం, కాలిని ఒత్తిపెట్టి లేవడం వంటి లక్షణాలను ఉటంకిస్తూ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరిగింది. మే 9న విక్టరీ డే ఉత్సవాల సందర్భంగా రెండోప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆనాటి సైనికాధికారులతో కలసి కూర్చున్నప్పుడు కూడా పుతిన్ కాళ్లను కవర్ చేస్తూ ఆకుపచ్చటి బ్లాంకెట్ వాడటాన్ని, పట్టి పట్టి నడవడాన్ని అనారోగ్య చిహాలుగానే భావిస్తున్నారు. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్నారని ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓలిగర్ ఒకరు పాశ్చాత్య వ్యాపార భాగస్వాములకు చెప్పిన విషయం సంచలనం రేపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..