న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విలువిద్యలో తెలుగు క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ దూసుకెళ్తున్నారు. వరుసగా జరిగిన బెర్లిన్ ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్, పారిస్ ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత మహిళా జట్టుకు గోల్డ్ మెడల్ అందించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యక్తిగతంగా కాంస్య పతకాలు సాధించారు. రెండు గోల్డ్ మెడల్స్‌తో స్వదేశం చేరుకున్న ఆర్చరీ మహిళా జట్టును ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం సన్మానించింది.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి సురేఖ సహా జట్టులోని సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో మాట్లాడిన జ్యోతి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. బెర్లిన్ (జర్మనీ)లో ఆగస్టు 1 – 6 వరకు జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు తాను ఈ ఛాంపియన్‌షిప్‌లో నేను వ్యక్తిగతంగా కాంస్య పతకం సాధించానని చెప్పారు.
ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో భారత మహిళా జట్టుకు ఒక్కసారి కూడా గోల్డ్ మెడల్ సాధించలేదని, తొలిసారిగా భారత బృందం గోల్డ్ మెడల్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమ బృంద సభ్యుల మధ్య సమన్వయం చాలా బావుందని, అదే స్ఫూర్తి, సమన్వయం కొనసాగిస్తూ ఆగస్టు 15-20 మధ్య పారిస్ (ఫ్రాన్స్)లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో కూడా భారత మహిళల బృందం గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు.
అందులోనూ వ్యక్తిగత విభాగంలో తాను కాంస్య పతకం సాధించినట్టు తెలిపారు. ఒక అంతర్జాతీయ మెడల్ సాధిస్తే చాలు అనుకుని తనను తన తల్లిదండ్రులు ఆర్చరీలో చేర్చారని, కానీ ఇప్పటి వరకు 50 అంతర్జాతీయ మెడల్స్ సాధించానని తెలిపారు. క్రీడల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, మద్దతు చాలా బావుందని కితాబిచ్చారు. ‘ఖేలో ఇండియా’ ద్వారా అథ్లెట్స్‌కి చాలా ప్రోత్సాహం లభిస్తోందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివిధ రకాలుగా అందిస్తున్న ప్రోత్సాహం బావుందని వెల్లడించారు.