(ప్రభన్యూస్ ప్రతినిధి, వికారాబాద్) ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుతం అనుమతి లేని లేఅవుట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అక్రమంగా వెలసిన లేఅవుట్‌లను తొలగించడంతో పాటు వాటిలోని స్థలాల రిజిస్ట్రేషన్‌లపై నిషేధం విధించింది. ఆతరువాత వీటి క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ పథకంను తీసుకవచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ పథకంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆతరువాత మరోసారి అనుమతి లేని లేఅవుట్‌లలో స్థలాలకు సంబంధించి ఉత్తరులు జారీ చేసింది. ఇప్పటి వరకు అనుమతి లేని లేఅవుట్‌లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు తిరిగి విక్రయించుకునే అవకాశం కల్పించింది. విక్రయించకుండా రియల్టర్ల వద్ద మిగిలిపోయిన స్థలాలను మాత్రం రిజిస్ట్రేషన్ చేయవద్దు అని ప్రభుతం స్పష్టం చేసింది. ప్రభుత నిర్ణయంతో రియల్టర్లపై తీవ్ర ప్రభావం పడింది. అనేక మార్లు ప్రభుత్వంకు విన్నవించినా ఫలితం లేకపోయింది. అయితే రియల్ వ్యాపారులు మాత్రం అనుమతి లేని లేఅవుట్‌లలో మిగిలిపోయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు తీసుకవస్తున్నారు. పెద్ద సంఖ్యలో రియల్ వ్యాపారులు ఇలాంటి ఉత్తర్వులను పొంది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉండడంతో సబ్‌రిజిస్ట్రార్‌లు సైతం ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు.
హైకోర్టు ఇస్తున్న తీర్పులో కొన్ని షరతులను పాటించాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతి లేని ప్లాట్లను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొనడంతో పాటు ఇది విక్రయదారులు.. కొనుగోలు దారుల రిస్క్ మేరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు డాక్యూమెంట్లలో పేర్కొనాలని తీర్పులో హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. నాలుగు రోజుల క్రితం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును కొట్టివేసింది. అనుమతి లేకుండా వెలసిన లేఅవుట్‌లలో మిగిలిపోయిన స్థలాల రిజిస్ట్రేషన్ చేయవద్దు అని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. అక్రమ లేఅవుట్‌లలో స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుతంకు అనుకూలంగా తీర్పు ఇవడంతో ఈ మేరకు స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని సబ్‌రిజిస్ట్రార్లకు ఆదేశించింది. ఇక నుంచి అనుమతి లేని లేఅవుట్‌లలో విక్రయించకుండా మిగిలిపోయిన స్థలాలను ఎట్టిపరిస్థితిలో కూడా రిజిస్ట్రేషన్ చేయవద్దు అని రిజిస్ట్రేషన్‌ల శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. గతంలో ఒక మారు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను మాత్రం తిరిగి రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం కల్పించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తర్పుతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు రియల్టర్లకు ప్రతికూలంగా మారిందని పేర్కొనవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..