Friday, November 22, 2024

Delhi: కుల గణనపై కేంద్రానికి సుప్రీం నోటీసులు.. 4 వారాల్లో అఫిడవిట్, 8 వారాల తర్వాత తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను కులాలవారిగా చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బీసీ సంక్షేమ సంఖ్యం వ్యవస్థాపక అధ్యక్షులు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, 4 వారాల్లో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 8 వారాల అనంతరం తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. దామాషా పద్ధతిలో జన సంఖ్యను అనుసరించి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు చట్ట సభల్లోనూ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని పోరాడుతున్న ఆర్. కృష్ణయ్య బీసీల జన సంఖ్యను తేల్చాలంటే జనాభా లెక్కల సేకరణను కులాలవారిగా చేపట్టడమొక్కటే పరిష్కారమని చెబుతున్నారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని కార్యాలయానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. బిహార్ సహా వివిధ రాష్ట్రాలు సైతం కులాలవారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టాలంటూ తీర్మానాలు చేశాయి. అయితే కేంద్రంలో పాలకులు మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ కులాలవారిగా జనాభా లెక్కలు కావాలని ఏ రాష్ట్రమైనా భావిస్తే, ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో జనగణన సమయంలో కులం తదితర వివరాలు సేకరించే వెసులుబాటు ఎలాగూ ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement