బీహార్ ప్రభుత్వ కుల గణన డేటాను నిలువరించలేమని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం సదరు అంశంపై సుదీర్ఘంగా విచారణ జరగాల్సింది ఉందని తెలిపింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. కులగణన నుంచి పొందిన డేటాపై చర్య తీసుకోకుండా బీహార్ ప్రభుత్వాన్ని నిలువరించే దిశగా స్టే లేదా యధాతథ పరిస్థితిని కొనసాగించేలా ఒక ఆదేశం ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ”రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోకుండా మేం నిలువరించలేము” అని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు.
కులగణన చేపట్టే దిశగా బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ పాట్నా హైకోర్టు ఆగస్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌జీవోలు యూత్ ఫర్ ఈక్వాలిటీ, ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ అపరాజిత సింగ్ వాదనలు వినిపించారు. విషయం కోర్టు పరిధిలో ఉండగానే కులగణనకు చెందిన డేటాను రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో ప్రచురించిందని తెలిపారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ మీరెందుకు ప్రచురించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్‌ను ప్రశ్నించారు. డేటా ప్రచురణకు వ్యతిరేకంగా కోర్టు ఎలాంటి ఆదేశం ఇవ్వలేదని దివాన్ తెలిపారు.