మనీలాండరింగ్ నిరోధక చట్టంకు 2019లో చేసిన సవరణలను సమర్దిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని దాదాపు 17 ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలకు అధిక అధికారాలను ఈ చట్టం కట్టబెడుతోందని ఆయా పార్టీలు ఆరోపించాయి. సవరించిన పీఎంఎల్ చట్టం ద్వారా ఈడీకి కల్పించిన విస్తృత అధికారాలు చెల్లుబాటుఅవుతాయని సుప్రీంకోర్టు జులై 27న తీర్పు చెప్పింది. దాదాపు 250 పిటిషన్లపై విచారణ జరిపి ఈ తీర్పు నిచ్చింది.
అరెస్ట్ చేసే అధికారం ఉండటం వల్ల ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశముందని పిటిషనర్లు చేసిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.. ఈ తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని హెచ్చరిస్తూ 17 ప్రతిపక్షాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. దీనిపై కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకె, ఆమ్‌ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్‌వాది పార్టీ , ఆర్జేడీ తదితర పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు.