Monday, November 18, 2024

అవినాశ్ రెడ్డి సహా ప్రతివాదులకు నోటీసులు.. వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న  ఆదేశాలతో పాటు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టగా, పిటిషనర్ డా. సునీత నర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ప్రతివాదిగా ఉన్న అవినాశ్ రెడ్డి తరఫున రంజిత్ కుమార్, రెండవ ప్రతివాదిగా ఉన్న సీబీఐ తరఫున డీపీ సింగ్ హాజరయ్యారు.

- Advertisement -

దారుణహత్యను గుండెపోటుగా చిత్రీకరించారు

తొలుత పిటిషనర్ తరఫున లూత్రా వాదనలు వినిపిస్తూ.. వైఎస్ వివేకానంద రెడ్డి రక్తపుమడుగులో పడి ఉంటే, గుండెపోటుతో మరణించారంటూ ప్రచారం చేసి, దారుణ హత్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న వ్యక్తి అప్రూవర్‌గా మారి జరిగిన విషయం మొత్తం చెప్పాడని వివరించారు. హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టే సమయానికి అనేక సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక దశలో ట్రయల్ (కోర్టులో విచారణ) సాధ్యంకాదని భావించిన సుప్రీంకోర్టు విచారణను తెలంగాణకు బదిలీ చేసిందని గుర్తుచేశారు. హత్య వెనుక అనేక కారణాలు, ఉద్దేశాలు కనిపిస్తున్నాయని, విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారులను కూడా మార్చి ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని లూత్రా చెప్పారు.

ఈ దశలో అప్రూవర్ వాంగ్మూలం ఆధారంగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మరొకరిని సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. ఈ దశలో అవినాశ్ రెడ్డి హైకోర్టును పదే పదే ఆశ్రయించడంతో ఈ నెల 25 వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చిందని తెలిపారు. అంతేకాకుండా సీబీఐ ప్రశ్నించడానికి పిలిచినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ప్రశ్నాపత్రాన్ని ప్రింటెడ్ కాపీ రూపంలో ఇవ్వాలని చెప్పిందని.. ఇదంతా చూస్తుంటే హైకోర్టు నిందితుణ్ణి ఇంట్లో అతిథిగా చూస్తున్నట్టుగా కనిపిస్తోందని లూత్రా అన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు దర్యాప్తునకు ఆటంకం కల్గించేలా ఉన్నాయని వెల్లడించారు.

హత్య చేసి ఫొటోలు తీశారు

ఈ దశలో మీరెందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయలేదంటూ ధర్మాసనం సీబీఐ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. తాము సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తున్నామని చెబుతూ.. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడని తెలిపారు. హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. హత్య కోసం రూ. 40 కోట్లు సుపారి మాట్లాడుకున్నారని, కొంత మొత్తం నిందితులకు అడ్వాన్సుగా అందజేశారని వివరించారు.

హత్యకు ముందు నిందితులంతా ఒకచోట కలుసుకున్నారని చెప్పేందుకు తగిన సాంకేతిక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, హత్య తర్వాత భౌతిక కాయాన్ని కొందరు నిందితులు ఫొటోలు తీశారని, హత్యను గుండెపోటుగా ప్రచారం చేయడం కోసం మృతదేహాన్ని పూర్తిగా గుడ్డల్లో చుట్టేసి బయటకు తీసుకొచ్చారని తెలిపారు. హత్య జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్‌కు గురయ్యాడని, సీఆర్పీసీ 160 ప్రకారం అతని వాంగ్మూలం నమోదు చేసుకోడానికి పిలిస్తే తొలుత అంగీకరించి, తర్వాత మనసు మార్చుకున్నాడని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఆ వెంటనే అతనికి పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చారని అన్నారు.

ఇవేం ఉత్తర్వులు? చాలా దారుణంగా ఉన్నాయి

పిటిషన్ సునీతతో పాటు సీబీఐ తరఫున వాదనల అనంతరం ధర్మాసనం ప్రతివాది అవినాశ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ.. తన వద్ద హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తప్ప సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కాపీలేవీ లేవని, జవాబు ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. ఈ దశలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ అసలు హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇస్తుందా? ఇవేం ఆదేశాలు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మధ్యంతర ఉత్తర్వులు చాలా దారుణంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఆదేశాలిస్తామని అన్నారు.

హైకోర్టు ఆదేశాలపై ‘స్టే’ ఇస్తే సీబీఐ అవినాశ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేస్తుందని, ఈ దశలో ‘స్టే’ ఇవ్వవద్దంటూ రంజిత్ కుమార్ అభ్యర్థించారు. ఆ సమయానికి అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారని, హైకోర్టు ఆదేశాలపై ‘స్టే’ ఇవ్వడం ద్వారా అరెస్టుకు లైన్ క్లియర్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినాశ్ తరఫున వాదనలు వినిపించేందుకు సోమవారం అవకాశం కల్పిస్తామని, ఆ రోజు ఒక గంట ముందుగానే బెంచ్ విచారణ చేపడుతుందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐకి ఆదేశాలిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఇతర మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఏముంది?

అవినాశ్ రెడ్డికి సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చి ప్రశ్నించడానికి పిలిచినందున, ఆయన ప్రతి రోజూ ఉదయం గం. 10.30కు విచారణకు హాజరవుతారని హైకోర్టు తెలిపింది. ఈ నెల 25 వరకు విచారణ జరపవచ్చని, అయితే ప్రశ్నలు, సమాధానాలు అన్నీ కూడా ముద్రించిన కాపీ రూపంలో ఉండాలని పేర్కొంది. ప్రశ్నాపత్రాన్ని అవినాశ్ రెడ్డికి ముందుగానే అందజేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఆడియో-వీడియో రికార్డు చేయాలని తెలిపింది. విచారణ పూర్తయిన తర్వాత సీబీఐ ఇచ్చే నివేదిక ఆధారంగా తాము ఈనెల 25న తుది ఉత్తర్వులిస్తామని, అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

సునీత పిటిషన్‌లో సంచలన ఆరోపణలు

సుప్రీంకోర్టులో డా. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో సంచలన అంశాలను ఆమె ప్రస్తావించారు. 2021 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక నిందితుడికి హత్యకేసులో క్లీన్ చిట్ ఇచ్చారని, కేసులో ప్రధాన అనుమానితుడికి ఇలా క్లీన్ చిట్ ఇవ్వడం దర్యాప్తును ప్రభావితం చేస్తుందని అన్నారు. ఛార్జిషీటులో వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డిల పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు సాగనీయకుండా అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్ అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారని ఆమె అన్నారు. డి. శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో సిబిఐ హాజరు పరిచినప్పుడు అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చి సుమారు 30 నిమిషాల పాటు శివశంకర్ రెడ్డితో గడిపారని, అంతేకాకుండా శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సీబీఐ అధికారులను బెదిరించారని ఆమె తెలిపారు.

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డిని, డి. శివశంకర్ రెడ్డిని గుడ్డిగా సమర్ధించారని, దర్యాప్తు సంస్థ సీబీఐపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. సజ్జల ప్రభుత్వంలో శక్తివంతమైన వ్యక్తి అని, ఆయనే ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే రోజు సజ్జల విలేకరుల సమావేశంలో నిందితులకు మద్దతుగా మాట్లాడిన తరువాత 2022 ఫిబ్రవరి 16న అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారి రాంసింగ్‌పై చేసిన ఫిర్యాదును కడప ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మాజిస్ట్రేట్ స్వీకరించి కడప పోలీసు స్టేషన్‌కు పంపించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement