న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా మంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న 143 ఎకరాల భూవివాదానికి తెర దించుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆక్రమణకు గురైన భూములు అన్ని రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు చెప్పింది. 1993లో 143 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోవడంతో అప్పటి ప్రభుత్వం వారికి నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములు వారికే చెందుతాయని అప్పటి హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది.
ఈ తీర్పును 2021లో డివిజన్ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించి సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కనపెట్టింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారు దాఖలు చేసిన పిటిషన్‌లు కొట్టివేసింది. ఇకపై ఈ భూముల విషయంలో కింది స్థాయి కోర్టులు, హైకోర్టులు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని తీర్పులో స్పష్టం చేసింది. ఇప్పుడు తాము ఇచ్చిన ఆదేశాలే ఫైనల్ అని, ఇకపై ఎలాంటి జోక్యాలు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.
పోలీసు విభాగంలోని గ్రేహౌండ్స్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని, అవి చట్టబద్దమైనవని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇకపై మంచిరేవుల భూమికి సంబంధించి ఏ పక్షం ఎటువంటి పిటిషన్లు, క్లెయిమ్‌లు, ప్రొసీడింగ్‌లను ఏ సివిల్, సిటీ లేదా హైకోర్టు స్వీకరించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో గ్రేహౌండ్స్ తరఫున కేకే వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది హర్ష, సీఎస్ వైద్యనాథన్, సీనియర్ అడ్వకేట్ గిరి హాజరయ్యారు.