పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరపనుంది. పెగాసస్ దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై సుప్రీంకోర్టు.. విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను కొనసాగించనుంది. పెగసస్ వివాదంపై విచారణ కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేయాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
కాగా, ప్రముఖ జర్నలిస్టు ఎన్.రామ్, శశికుమార్, న్యాయవాది ఎం.ఎల్.శర్మ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆగస్టు 10న విచారణ జరిపిన ధర్మాసనం.. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరగడం దురదృష్టకరం అని పేర్కొంది. కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలని తెలిపింది.