Tuesday, November 26, 2024

Delhi | సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణకు నో చెప్పిన సుప్రీం.. పాల్ పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపిన విచారణలో కేఏ పాల్ తన కేసులో తానే (పార్టీ ఇన్ పర్సన్) స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా దేశంలో జరిగే అగ్నిప్రమాదలన్నింటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలా అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అయితే సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని – ‘నర బలి’ జరిగిందని ఆరోపించారు. అనంతరం కేసుతో సంబంధం లేని అంశాలను ఆయన ప్రస్తావించడంపై కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చివరగా పాల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించింది.

ఓడిపోలేదు – పోరాడుతూనే ఉంటా: కేఏ పాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్)పై తాను ఇప్పటి వరకు 6 కేసులు గెలిచానని, ఇంకా అనేక కేసులు ప్రస్తుతం పెండింగులో ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. సుప్రీంకోర్టులో కేసు అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఓడిపోలేదని, పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ట్రంప్ అరెస్ట్ అవుతారని తాను గతంలోనే  చెప్పానని గుర్తుచేశారు. తనపై సిరిసిల్లలో దాడి చేసిన వారిని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయలేదని అన్నారు. అనిల్ కుమార్ తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం, సచివాలయం ప్రారంభించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

హిట్లర్ చనిపోయిన ఏప్రిల్ 30న సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తాను చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. లేనిపోని కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తనను చంపేందుకు చాలా మంది కుట్ర చేస్తున్నారని కేఏ పాల్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు  పడుతున్న రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రజాశాంతి పార్టీని తెలుగు రాష్ట్రాలలో గెలిపించాలని.. ఢిల్లీ, పంజాబ్‌లో కేజ్రీవాల్‌ను ఎలా ఎన్నుకున్నారో తెలుగు రాష్ట్రాల్లో తనను కూడా అలాగే ఎన్నుకోవాలని కోరారు. తెలుగు ప్రజల జీవితాలు  మార్చగల సామర్థ్యం తన ఒక్కడికే ఉందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement