న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసులో ఐదుగురు సాక్షులను ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, రేవంత్ అభ్యర్థనను తిరస్కరించింది. మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి తో కూడిన ఓటుకు నోటు కేసులో దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టింది. అందులో తొలి కేసుగా ఉన్న రేవంత్ పిటిషన్‌పై విచారణ ముగించి.. ఈ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా ఆదేశించింది.
అనుబంధంగా వేరే అభ్యర్థనలతో దాఖలైన సండ్ర వెంకట వీరయ్య పిటిషన్, రేవంత్ రెడ్డి మరో పిటిషన్లపై విచారణను మాత్రం వాయిదా వేసింది. సాక్షులను ఒకేసారి కలిపి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మరో రెండు ఇతర పిటిషన్లపై విచారణనను నవంబర్ నెలకు వాయిదా వేసింది.