ఏపీ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు తమకు కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపణలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గతంలో రాజధాని భూముల్లో అవకతవకలు, అవినీతి జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలూ జరిగలేదంటూ తీర్పు ఇచ్చింది. అయితే, హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, ఆలోచనలు వినకుండా హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. మేము లేవనెత్తిన ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోనందున పిటిషన్‌పై విచారణ చేపట్టండి’ అంటూ దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు తమకు ఎక్కడా కనిపించడం లేదంటూ దుష్యంత్ దవే వాదనలతో విభేదించింది. తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.
ఈ వార్త కూడా చదవండి: వైసీపీ ఫ్యాన్ గుర్తుకు యువత ఉరివేసుకుంటోంది: జేసీ