Sunday, November 3, 2024

Delhi | భారతి సిమెంట్స్ కేసులో ఈడీకి చుక్కెదురు.. ఈడీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతి సిమెంట్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులకు సమాన విలువ కల్గిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను సమర్పించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించడాన్ని ఈడీ సుప్రీంలో సవాల్ చేసింది. ఈడీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు నేరారోపణలతో సంబంధం ఉన్న ఆస్తులా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.

ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. రాజు.. ఆ ఆస్తులు నేరారోపణలతో సంబంధం ఉన్నవేమీ కాదని, కాకపోతే నేరారోపణల్లో ఉన్న మొత్తం విలువకు సమానమైన ఆస్తులని తెలిపారు. నేరంతో సంబంధం లేని ఆస్తులు అని ఈడీ కూడా అంగీకరించినప్పుడు పిటిషన్‌ను విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ఈడీ అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో భారతి సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, మరో న్యాయవాది లిజ్ మ్యాథ్యూ వాదనలు వినిపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement