Thursday, November 21, 2024

Delhi | అంగళ్లు కేసులో ప్రభుత్వానికి చుక్కెదురు.. హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న తెలుగుదేశం నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. వారికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది.

తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు, నల్లారి కిషోర్‌ కుమర్‌ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఆ పిటిషన్లలో కోరింది. ఇందులో చల్లా బాబుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పిటషన్లు దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లపై ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.

ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది. భద్రత కల్పించాల్సిన పోలీసులే.. సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏంటని కూడా అడిగింది. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఈ ఘటనలో పోలీసు అధికారులు గాయపడ్డారని తెలిపారు. అందుకే ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని వివరించారు.

- Advertisement -

ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం, పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అని ప్రశ్నించింది. ఈ కేసులో హైకోర్టు ఇప్పటికే బెయిల్‌ ఇచ్చింది కాబట్టి అందులో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని ధర్మాసనంలోని జస్టిస్ బేలా ఎం. త్రివేది వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement