ఢిల్లీ- వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. 42 రోజులు విరామం తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ముందుకు పలు కేసులు విచారణకు రానున్నాయి.
యూపీలో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్లను పోలీసుల సమక్షంలోనే హతమార్చడంపై విచారణకు కమిషన్ను నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, మణిపుర్ అల్లర్లు వంటి కేసులను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు మణిపుర్ అల్లర్ల పిటిషన్లన్నీ విచారణకు రానున్నాయి. కుకీ తెగవారికి సైన్యంతో రక్షణ కల్పించడం, వారిపై దాడులకు పాల్పడుతున్నవారిని విచారించడం వంటివి కోరుతూ పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి ఇవి దాఖలయ్యాయి. పెళ్లైన పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పురుషుల హక్కుల పరిరక్షణకు జాతీయ కమిషన్ ఏర్పాటు, స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతి, ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మొదలయ్యాక అర్హత నిబంధనలను మార్చడానికి ప్రభుత్వాలకు ఉన్న అవకాశం, ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటు, 370 అధికరణం రద్దు, బిల్కిస్ బానో కేసులో 11 మంది ముద్దాయిలకు విముక్తి కల్పించడం తగదన్న పిటిషన్ వంటివన్నీ విచారణకు రానున్నాయి