సింగపూర్‌కు పరారైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే చేసిన రాజీనామాను ఆమోదించిననట్లు స్పీకర్ ప్రకటించగానే శుక్రవారం ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ వారు వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు ప్రకటించారు. గొటబాయ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు మాజీ ప్రధాని, గొటబాయ సోదరుడు మహింద రాజపక్సే, మరో తమ్ముడు, మాజీ ఆర్థికమంత్రి బసిల్ రాజపక్సే దేశం విడిచి వెళ్లరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి మరిన్ని సమస్యలకు కారణమైంది. ప్రజల తిరుగుబాటుతో అధ్యక్షుడు గొటబాయ, కుటుంబ సభ్యులతో పలాయనం చిత్తగించడంతో రాజకీయ అనిశ్ఛితి నెలకొంది. వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని స్పీకర్ శుక్రవారం ప్రకటించారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగనుండగా శనివారం ప్రారంభమవుతుంది. ప్రస్తుత ప్రధాని రణిల్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు విపక్షాలు ససేమిరా అంటున్నప్పటికీ అధికార పార్టీ మెజారిటీ ఉండటం, ఆయనకు ఆ పార్టీ ఎంపీల మద్దతు ఉండటంతో మార్గం సుగమం కావొచ్చు. అయితే, రణిల్‌పైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అది అంద సులువు కాబోదని భావిస్తున్నారు. ప్రధానిగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే చట్టబద్ధంగా రాజీనామా చేశారు. దానిని గురువారమే ఆమోదించాం.. 20వ తేదీన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం, అంతవరకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే బాధ్యతలు నిర్వహిస్తారని స్పీకర్ మహింద యప అబేయవర్దన మీడియాకు చెప్పారు.
మహింద రాజపక్సేకు చుక్కెదురు..
మాజీ అధ్యక్షుడు గొటబాయ సోదరుడు, మాజీ ప్రధాని మహింద రాజపక్సే, అతడి మరో తమ్ముడు బసిల్ రాజపక్సేకు సుప్రీంకోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. నిన్నమొన్నటివరకు తిరుగులేని అధికారం చెలాయించి మాల్దివుల మీదుగా సింగపూర్‌కు పలాయనం చిత్తగించి, అక్కడకు వెళ్లాక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో అతడి సోదరులు దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. కాగా అధ్యక్ష భవనాన్ని భద్రతా బలగాలకు ఆందోళనకారులు అప్పగించారు. వెంటనే ఫోరెన్సిక్ బృందాలు అక్కడకు చేరుకుని ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందన్నదానిపై ఆధారాలు సేకరించారు.