రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితి చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక ఆదేశాలు వెలువరించింది.
వలస కార్మికుల రేషన్ కార్డుల వెరిఫికేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికులకు 4 వారాల్లోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేసి.. రేషన్ కార్డులు అందించాలని ఆదేశాలు వెలువరించింది. ఒకవేళ రాష్ట్రాలు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయలేకపోతే ఆయా రాష్ట్రాల కార్యదర్శులకు సమన్లు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, ఈ-శ్రమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ.. ఇప్పటికీ.. దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తెలంగాణ, బిహార్ రాష్ట్రాలు మాత్రమే వలస కార్మికుల రేషన్ కార్డుల జారీ కోసం 100 శాతం వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశాయి.