Tuesday, November 19, 2024

Supreme Court – వివేకా హ‌త్య కేసు – ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ – మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించాడని సునీత తరపు న్యాయవాది సిద్దార్ధలూథ్ర ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని లూథ్రా పేర్కొన్నారు. వెళ్లిన డాక్టర్‌ రెగ్యులర్‌గా వెళ్లే వారా కాదా అని సీజేఐ ప్రశ్నించింది. డాక్టర్‌ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఆయన రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్‌ కాదని న్యాయవాది తెలిపారు. ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలన్న సునీత తరపు న్యాయవాది కోరారు.

అవినాష్‌ రెడ్డి వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్నారని, కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లూథ్రా పేర్కొన్నారు. సునీత న్యాయవాది వాదనలను సమర్ధించిన సిజెఐ ధర్మాసనం. ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది. ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 3కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement