దేశ రాజధానిలో సేవల (services) నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకు వెళ్లింది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తన వైఖరిని కోరుతూ సుప్రీంకోర్టు ఇవ్వాల (సోమవారం) కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఇవ్వాల కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తుండగా.. తన అభ్యర్థనను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా పార్టీగా చేర్చాలని బెంచ్ కోరింది.
ఇక.. AAP ప్రభుత్వం తన అభ్యర్ధనలో ఇది ” unconstitutional exercise of executive fiat ” అని పేర్కొంది. ఇది సుప్రీం కోర్టు, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని కాలరాయడేమనని తన వాదనల్లో స్పష్టంగా వినిపించింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతో పాటు.. దానిపై మధ్యంతర స్టే విధించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది.
కాగా, దీనిపై సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల జీవిత భాగస్వాములు, ఆప్ పార్టీ కార్యకర్తలను పదవుల్లో నియమించారని, 437 మంది కన్సల్టెంట్లను తొలగించడంపై ప్రతిస్పందన దాఖలు చేయడానికి కేంద్రానికి సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇక, ఈ కేసు వచ్చే సోమవారం (జులై 17న) విచారణకు వాయిదా పడింది.
ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్ ఏమిటంటే..
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గించేందుకు కేంద్రం మే 19వ తేదీన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమికి సంబంధించిన సేవలను మినహాయించి.. ఢిల్లీలోని సేవల నియంత్రణ అంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కొద్ది రోజుల తర్వాత కేంద్రం ఈ ఆర్డర్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటన చేపట్టారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు బీజేపీయేతర పార్టీలతో భేటీ అయ్యారు. ఈ ఆర్డినెన్స్ దేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేస్తుందని చెబుతూ అన్ని పార్టీ సపోర్టును కూడగడుతున్నారు కేజ్రీవాల్.