Tuesday, November 26, 2024

Delhi: ప్రత్యేక హోదా, విభజన హామీలపై సుప్రీంకోర్టు విచారణ.. హైకోర్టులో కొణతాల పిటిషన్ విచారణపై స్టే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విభజన హామీల అమలుకు సంబంధించి హైకోర్టులో విచారణపై స్టే విధిస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను త్వరగా అమలు చేయాలంటూ కొణతాల వేసిన పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రవీంద్రభట్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. హైకోర్టులో కొణతాల పిటిషన్‌ విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

విభజన అంశాలపై హోంశాఖ సమావేశం
ఈనెల 26, 27 తేదీలలో ఏపీ విభజన చట్టంలోని అంశాలపై కేంద్ర హోం శాఖ సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు హోంశాఖ ఆహ్వానం పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement