Wednesday, September 18, 2024

Supreme Court – డాక్ట‌ర్ల‌ను కాపాడేందుకు జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ …..

కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసు విచార‌ణ‌
సుమోటాగా తీసుకున్న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం
త్వ‌ర‌గా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సీబీఐకి సూచ‌న‌
రెండు నెల‌ల్లోగా టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇవ్వాలి
టాస్క్‌ఫోర్స్ స‌భ్యులుగా డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రావు, ఎయిమ్స్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌
కేసు విచార‌ణ ఎల్లుండికి వాయిదా వేసిన ధ‌ర్మాస‌నం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్ట‌ర్‌పై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల‌ని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. జాతీయస్థాయిలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

డాక్టర్ల రక్షణకు జాతీయ టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌ ఉంటారు. అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని, అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా ఈనెల 22 కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.

మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిప‌ల్‌పై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం..

సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్‌ఫోర్స్‌కు న్యాయస్థానం బాధ్యతలు అప్పగించింది. కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డా.నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆస్పత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని న్యాయ‌మూర్తులు నిలదీశారు. ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సందేహాలు వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన వ్యవస్థీకృత సమస్యలపై ఆందోళనలు రేకెత్తిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం కేసుపై విచారణ జరిపింది. యువ వైద్యులు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు వారి విధులకు వెళ్లలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే. మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మీడియాలో బాధితురాలి ఫొటో, పేరు రావ‌డంపై ఆందోళ‌న‌

కోల్‌కతా హత్యాచార ఘటనలో బాధితురాలి పేరు మీడియాలో రావడం, ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రసారం కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించింది. ‘ఇది చాలా ఆందోళనకరం’ అని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement