జల్లికట్టు క్రీడకు మద్దతుగా తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. జంతువుల ప్రమేయంతో నిర్వహించే క్రీడలకు మద్దతుగా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు తీసుకువచ్చిన అదే తరహా చట్టాలను జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ హృషీకేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. సదరు క్రీడ రాష్ట్ర సంస్కృతిలో భాగమనే దృక్కోణంతో చేసిన చట్టానికి విఘాతం కలిగించలేమని పేర్కొంది. శాసనసభకు భిన్నమైన భిన్నమైన దృక్కోణాన్ని న్యాయవ్యవస్థ చేపట్టలేదని, అలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో శాసనసభ సరైందిగా తెలిపింది.
అదే సమయంలో జంతువుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది. జల్లికట్టు క్రీడ అనేక సంవత్సరాలుగా తమిళనాడు సంస్కృతిలో అవిభాజ్యమైనదిగా పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన పత్రాలు, ఇతర ఆధారాలతో కోర్టు సంతృప్తి చెందినట్టు ధర్మాసనం పేర్కొంది. అది న్యాయవ్యవస్థకు అతీతమైన అంశంగా అభిప్రాయపడింది. జల్లికట్టు, ఎడ్ల బండ్ల పోటీలను అనుమతిస్తూ తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గతేడాది డిసెంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది.
జల్లికట్టు అనేది కేవలం ఒక వినోదాన్ని కలిగించే క్రీడ కాదని, అది ఘనమైన చరిత్ర, సాంస్కృతి విలువను సంతరించుకున్న ఒక వేడుకగా సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించుకున్న ఒక రాతపూర్వక సమాధానంలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. భారత జంతు సంక్షేమ బోర్డు వర్సెస్ ఎ నాగరాజా కేసులో రాష్ట్రంలో ఎద్దులతో జల్లికట్టుపై, దేశవ్యాప్తంగా ఎడ్ల బండ్ల పందేలపై నిషేధం విధిస్తూ ఇద్దరు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2014 మే నెలలో తీర్పు ఇచ్చింది. జల్లికట్టు క్రీడను అనుమతించే క్రమంలో 1960 నాటి కేంద్ర ప్రభుత్వపు జంతువులపై క్రూరత్వపు నిరోధక చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం సవరించింది.