Thursday, December 12, 2024

Supreme Court – ఐపీసీ సెక్షన్ 498ఏ చట్టంతో కక్ష సాధింపు – దుర్వినియోగమవుతుందన్న సుప్రీం కోర్టు

దుర్వినియోగం చేస్తున్నారు
అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు
భర్త, అత‌ని కుటుంబంపై కక్ష సాధింపు చ‌ర్య‌లు
తప్పుడు కేసులు పెడుతున్నారని ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం
ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టిన సుప్రీం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూఢిల్లీ:

అత్తవారింట్లో భర్త, అత‌ని కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నార‌ని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భర్తపై, అత‌ని కుటుంబంపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం 498 ఏ సెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొంది. ఈమేరకు తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ కీల‌క వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణ హైకోర్టును త‌ప్పుప‌ట్టిన సుప్రీం ధ‌ర్మాస‌నం..

వివాహాన్ని రద్దు చేయాల‌ని తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టేయాలని తెలంగాణకు చెందిన ఒక‌రు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్‌ను కొట్టేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణ‌కు స్వీక‌రించిన‌ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టింది. వ్యక్తిగత కక్ష సాధింపు కోసమే ఈ కేసు పెట్టార‌ని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసు కొట్టేయడాన్ని, నిరాకరించడం తప్పిదమని సుప్రీం ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

- Advertisement -

నిర్ధార‌ణ అయితే మూడేండ్ల జైలు..

ఐపీసీ సెక్షన్ 498 ఏ లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86ను భర్త తరపువాళ్లపై కక్ష సాధించేందుకు భార్య ఓ ఆయుధంగా మార్చుకుంటోందని సుప్రీం కోర్టు ద్విస‌భ‌ ధ‌ర్మాస‌నం విమర్శించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతుండడంపై సుప్రీం బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలతో అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ఫిర్యాదుల ఆధారంగా భర్తను, భర్త కుటుంబ సభ్యులను ప్రాసిక్యూట్ చేయడం తగదని, ఈ తరహా ఫిర్యాదుల విషయంలో జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసు యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది.

ఐపీసీ సెక్షన్ 498 ఏ.. నాన్‌బెయిల‌బుల్ కేసు..

భర్త, అత‌ని కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడిన సందర్భాల్లో భార్యకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినదే ఐపీసీ సెక్షన్ 498 ఏ.. లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86.. ఈ సెక్షన్ ప్రకారం.. వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం లేదా మరేదైనా కారణంతో ఆడాళ్ల‌పై భర్త, అత‌ని కుటుంబ సభ్యులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడితే ఐపీసీ 498 ఏ, బీఎన్ఎస్ 86 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో దోషిగా తేలితే భర్త, అత‌ని కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన కేసుల్లో బెయిల్ పొందే వీలులేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అందుకోసమ‌నే ఎక్కువ మంది మ‌హిళ‌లు భ‌ర్త‌తోపాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను ఇరికించే య‌త్నంలో ఇలాంటి కేసుల‌ను ఎక్కువ‌గా ఎంచుకుంటున్న‌ట్టు సుప్రీంకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement