Tuesday, November 26, 2024

ఒడిషా ఆలయంపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లి : పూరీ జగన్నాథ ఆలయం అభి వృద్ది ప్రాజెక్టుపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూరీ జగన్నాథ ఆలయం ప్రపంచ విఖ్యాతి నొందిందనీ, ఆ ఆలయం అభివృద్ది కోసంచేపట్టిన ప్రాజెక్టుపై ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడంలోప్రచారం కోసం తప్ప ప్రజాప్రయోజనం ఏమీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్ల వల్ల సమయం వృధా తప్ప వేరే ప్రయోజనం ఉండదని పేర్కొంది. ఇలాంటి ఆలోచనలను ఆరంభంలోనే తుంచి వేయాలని జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పురాతనమైన ఈ ఆలయంలో నిషేధిత ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల వల్ల ఆలయం గోడలు బీటలు వారే ప్రమాదం ఉందనీ, ఇది పూర్తిగా హెరిటేజ్‌ కారిడార్‌ పరిధిలో ఉందని పిటిషనర్‌పేర్కొన్నారు.

కాగా, వచ్చే నెలలో జరిగే రథయాత్ర కార్యక్రమానికి ముందు ఈ ఆలయంలో భక్తుల సౌకర్యాల కోసం టాయ్‌లెట్లు, ఇతర నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, భక్తుల సౌకర్యార్ధం చేపట్టే నిర్మాణాలను ఆపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆలయం భద్రత బాధ్యత ప్రభుత్వానిదేననీ, ఆ విషయంలో అనవసరమైన ఆందోళనలు వ్యక్తం చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో అనవసరమైన ఆందోళనలతోపుట్టగొడుగుల్లా ఇలాంటి పిటిషన్లు దాఖలవుతున్నాయనీ, ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఇప్పటికైనా నిరోధించాలని ధర్మాసనంపేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement