Friday, November 22, 2024

ఇవాళ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సీజేఐ జ‌స్టిస్ బోబ్డే

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బోబ్డే ప‌ద‌వీకాలం నేటితో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇవాళ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. రేపు సాయంత్రం వ‌ర్చువ‌ల్‌గా జ‌స్టిస్ బోబ్డే వీడ్కోలు స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. రాష్ర్టప‌తి భ‌వ‌న్‌లో 48వ సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చేత రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ క్ర‌మంలో నేడు జ‌స్టిస్ బోబ్డేతో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ధ‌ర్మాస‌నంలో కూర్చోనున్నారు. కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల స‌మ‌క్షంలో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఉప రాష్ర్ట‌ప‌తి వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్ర‌టేరియ‌ట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారులతో పాటు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన‌నున్నారు.

‌సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement