నిలిపివేత ఫిటిషన్‌పై సుప్రీం తీర్పు
ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది
జోక్యం చేసుకుంటే అంతా గందరగోళమే
కేంద్ర చేసిన చట్టాన్ని తప్పుపట్టలేం..
కొత్త కమిషనర్లపై ఎటువంటి రిమార్క్ లు లేవు
లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఫిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కొత్తగా నియమితులైన వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. ”ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదు. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేం. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం” అని ధర్మాసనం అభిప్రాయపడింది.
సీజేఐని తప్పించడం సరైందే…
2023 చట్టం రూపొందించక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో విపక్షనేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాల్ చేస్తూ ఫిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని తెలిపింది.