Tuesday, November 26, 2024

గంగిరెడ్డి బెయిల్ రద్దు కేసుపై విచారణ.. 28కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. గంగిరెడ్డి బెయిర్ రద్దు కేసుపై విచారణ ప్రారంభించే సమయంలో న్యాయవాదులు ఈ కేసుతో ముడిపడ్డ సునీత పిటిషన్ గురించి గుర్తుచేయడంతో.. ఆ కేసులో తీర్పు వెలువడిన తర్వాతనే దీనిపై విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.

బెయిల్ మీద బయట ఉన్న గంగి రెడ్డి సాక్షులనే కాదు, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును కోరగా, సీబీఐ చెబుతున్న కారణాలకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయిందంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 28న విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement