న్యూఢిల్లీ – వివాహాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువడించింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ఆధారంగా విచక్షణాధికారాలను ఉపయోగించే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయని తెలిపింది.దీని ఆధారంగా విడాకులను మంజూరు చేయవచ్చని పేర్కొంది. విడాకులను మంజూరు చేయడానికి ఫ్యామిలీ కోర్టులను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయిదుమంది న్యాయమూర్థులు- జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓఖా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఈ ఆదేశాలను జారీ చేసింది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, వివాహ బంధాన్ని పునరుద్ధరించడం సాధ్యం కానప్పుడు సుప్రీంకోర్టు ఆ వివాహాన్ని రద్దు చేయగలదని పేర్కొంది.
రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ఆధారంగా తన విచక్షణాధికారాలను ఉపయోగించి విడాకులను మంజూరు చేయవచ్చని తెలిపింది. దీనికోసం ఫ్యామిలీ కోర్టులను సంప్రదించనక్కర్లేదని పేర్కొంది. అలా విడాకులను మంజూరు చేయడం పబ్లిక్ పాలసీ లేదా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. విడాకులను పొందడానికి ఆరు నెలల పాటు తప్పనిసరిగా వేచి ఉండక్కరలేదని పేర్కొంది.
ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కపిల్ సిబల్, వీ గిరి, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా అమీసీ క్యూరీలుగా వ్యవహరించారు. కిందటి నెల 29వ తేదీ నాడే విచారణలను ముగించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవ్వాళ తాజాగా తన తీర్పును వెలువడించింది. విడాకులను మంజూరు చేయడంలో విచక్షణాధికారాలను వినియోగించవచ్చని తెలిపింది..అయితే విడాకులకు భార్యభర్తలిద్దరూ అంగీకారం తెలిపినప్పుడు మాత్రమే న్యాయమూర్తి తన విచాక్షణాదికారంతో విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం తన తీర్పులో తెలిపింది.