న్యూఢిల్లి : ఎన్నికల్లో ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులకు వీలు కల్పించే నిబంధనను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ నిబంధనను రద్దు చేయడం కుదరదనీ,ఇది విధానపరమైన రాజకీయ నిర్ణయానికి సంబంధించిందని స్పష్టం చేశారు.ఈ ధర్మాసనంలో జస్టిస్ పిఎస్ నరసింహ,జస్టిస్ పర్ధివాలా సభ్యులుగా ఉన్నారు.
ఒకటి కన్నా ఎక్కువ స్థానాలకు అభ్యర్ధులు పోటీ చేయడానికి వీలు కల్పించే నిబంధనను తొలగించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు.ఒకటి కన్నా ఎక్కువ స్థానాలకు అభ్యర్ధులు పోటీ చేయడం ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయమనీ,
దానిని తొలగించలేమని బెంచ్ స్పష్టం చేసింది.రెండు స్థానాల నుంచి పోటీ చేసే వారు ఎక్కువ ధరావత్తు జమ చేయాలని ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు.వివిధ కారణాల రీత్యా అభ్యర్ధులు ఒకటి కన్నా ఎక్కువ స్థానాలనుంచి పోటీ చేయవచ్చని బెంచ్ పేర్కొంది.ఈ సంప్రదాయాన్ని తొలగించే విషయమై నిర్ణయం తీసుకోవల్సింది పార్లమెంటేనని బెంచ్ స్పష్టం చేసింది.