Saturday, November 23, 2024

బెంబేళెత్తిస్తున్న టమాట, పచ్చిమిర్చి రేట్లు.. అన్ని కూరగాయలదీ అదే పరిస్థితి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అన్ని వంటల్లో చేరి అద్భుత రుచిని ఇచ్చే టమాట, పచ్చి మిరపకాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో జనం బెంబేళెత్తిపోతున్నారు. 20 రోజుల క్రితం వరకు రూ.10కే కేజీ లభించిన టమాట ధర ఒక్కసారిగా రూ.60ని దాటేసింది. పచ్చి మిర్చి కూడా కిలో రూ.80కి చేరి కొనాలంటేనే జనానికి మంటపుట్టిస్తోంది. తీవ్రమైన ఎండలు, సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, అననకూల సీజన్‌తోపాటు అకాల వర్షాల కారణంగా టమాట, పచ్చి మిర్చి దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో కొద్ది రోజులుగా ఈ రెండు కూరగాయల ధరలు మిగతా కాయగూరలకంటే రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. సాధారణం కంటే నాలుగైదు రెట్లు అధిక ధరల కారణంగా టమాట, పచ్చిమిర్చిని కొనేందుకు వినియోగదారులు జంకుతున్నారు.

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు మార్కెట్లకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున టమాట, పచ్చిమిర్చి దిగుమతి అవుతుంటోంది. అయితే ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో టమాట, పచ్చిమిర్చి, ఇతర కూరగాయల సాగు తగ్గడంతోపాటు దిగుమతులు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో కూరిగాయయల ధరలు ఆకాశనంటుతున్నాయి. వందతో మార్కెట్‌కు వెళితే కనీసం రెండు కేజీల కూరగాయలు కూడా రాని పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. మరో రెండు నెలలు మార్కెట్‌లో కూరగాయల ధరలు ప్రత్యేకించి టమాట, పచ్చిమిర్చి ధర అధికంగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగాపండే కూరగాయలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు పెరిగితేనే ధరలు దిగి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement