Friday, November 22, 2024

Delhi | వైజాగ్ స్టీల్ ప్లాంటును ఆదుకోండి.. కేంద్రానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్)కు చేయూతనివ్వాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ నష్టాలబాట పట్టడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని నిందించారు. 2004 నుంచి 2014 వరకు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, స్టీల్ ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయని నిందించారు.

సొంత గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చాలా కాలంగా కోరుతోందని తెలిపారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీని సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో రాయ్‌బరేలీలో రూ. 2,000 కోట్ల పెట్టుబడితో ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించిందని, ఈ కారణంగా స్టీల్ ప్లాంట్ నష్టపోయిందని తెలిపారు. రాయ్ బరేలీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం కోసం బలవంతంగా స్టీల్ ప్లాంటుకు రూ. 14,500 కోట్ల రుణాన్ని అధిక వడ్డీకి ఇప్పించి మరింత నష్టపోయేలా చేసిందని ఆరోపించారు.

2021లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంకా అమలుపరచకుండా ఆపటం సంతోషకరమైన పరిణామమని, అందుకు తాను కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. 2022 నుండి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పనిచేయడం ఆగిపోయిందని, దాని మరమ్మత్తు పనులకు అవసరమైన సహాయం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు గత కొద్దికాలంగా సకాలంలో చెల్లించలేని పరిస్థితి నెలకొందని, 2021 నుంచి ఎగ్జిక్యూటివ్‌ల పదోన్నతులు కూడా నిలిచిపోయాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి తీసుకున్న అనేక మంది యువ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా టైమ్‌బౌండ్ ప్రమోషన్‌లు ఇవ్వలేదని తెలిపారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వం అందించిన మాదిరిగా సంస్థకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఉక్కుశాఖ కార్యదర్శితో భేటీ

స్టీల్ ప్లాంట్‌ సమస్యలపై చర్చించేందుకు ఎంపీ జీవీఎల్ కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాను కలిశారు. ప్లాంట్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు కొత్త ప్రమోషన్ విధానంలో పదోన్నతులు వెంటనే అందించాలని కోరారు. తనతో పాటు స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ యూనియన్ నాయకులను వెంటతీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement