న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రకృతి వైపరీత్యాలు, తామర తెగులు కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులకు జాతీయ విపత్తు నిధి నుంచి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వైపరీత్యాల కారణంగా రైతులు దిగుబడి కోల్పోయిన రాష్ట్రాలకు 2015-16 నుంచి 2017-18 వరకు ఎన్డీఆర్‌ఎప్ కింద రూ.22972కోట్లు విడుదల చేశారని, అదేవిధంగా ఇప్పుడు మిర్చి రైతులకు సాయమందించాలని ఆయన కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు లేఖ రాశారు.
ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక మిర్చి రైతులకు సాయమందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తామర తెగులు సోకడం వల్ల జరిగిన విధ్వంసాన్ని పరిశీలించడానికి తమ అభ్యర్థనల మేరకు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ బృందాన్ని ఏపీకి, పొరుగు రాష్ట్రాలకు పంపిందని పేర్కొన్నారు. తెగుళ్లు, భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 90 శాతం దిగుబడి తగ్గి రైతులకు నష్టం వాటిల్లినట్టు ఆ బృందం గుర్తించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులను రక్షించడం మా బాధ్యత అన్న ప్రధానమంత్రి మాటలను గుర్తు చేస్తూ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి కష్టకాలంలో అన్నదాతలను ఆదుకోవాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,