Wednesday, November 20, 2024

Big story : నకిలీకి బ్రేక్‌ పడేనా.. ప్రతిఏటా కోట్లాది రూపాయల నకిలీ పత్తి విత్తనాలు సరఫరా

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్ బ్యూరో : అసలు ప్యాకింగ్‌కు ఏమాత్రం తేడా కనిపించదు… లోతుగా పరిశీలిస్తే తప్పా అది నకిలీ ప్యాకింగ్‌గా గుర్తించాల్సి ఉంటుంది… వానాకాలం సీజన్‌ ప్రారంభం కంటే ముందే నకిలీ పత్తి విత్తనాల తయారీకి శ్రీకారం చుడతారు… ఏ మాత్రం తేడా లేకుండా రంగురంగుల బొమ్మలతో ప్యాకింగ్‌లు తయారు చేస్తారు… ఈ విత్తనాలు ద్వారా దండిగా దిగుబడి వస్తుందని రైతులను బాగా నమ్మిస్తారు… ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మె రైతులు రంగురంగుల ప్యాకింగ్‌లు చూసి మోసపోతున్నారు. వాటిని కొనుగోలు చేసి సాగు చేసిన తరువాత గానీ అవి నకిలీ విత్తనాలనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా పూర్తి స్థాయిలో మాత్రం బ్రేక్‌ పడటం లేదు. ప్రతిఏటా కోట్లాది రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి రావడం రైతులు కొనుగోలు చేయడం మోసపోవడం పరిపాటిగా మారింది… మరో నెలరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. అప్పుడే నకిలీ విత్తనాలు సరఫరా చేసేందుకు దళారులు సిద్ధమయ్యాయి… వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ట్రాస్క్‌ ఫోర్సు టీంలతోపాటు పోలీసు, వ్యవసాయ శాఖ లు సంయుక్తంగా తనిఖీలు చేసి నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధం చేశారు…..

రంగురంగుల ప్యాకింగ్‌లు చూసి రైతులు మోసపోతున్నారు. నిజమైన విత్తనాలకు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ విత్తనాల ప్యాకింగ్‌లు అచ్చుగుద్దినట్లు తయారు చేసి రైతులను నిలువున మోసం చేస్తున్నారు. విత్తనాలు మార్చడం ద్వారా దిగుబడి బాగా వస్తుందనే ఆశతో రైతులు నిలువున మోసపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని దళారులు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ముందుగానే నకిలీ విత్తనాలు మార్కెట్‌లకు రావడం ఆలస్యమైతే పత్తి విత్తనాలు దొరకవనే భయంతో చాలామంది రైతులు ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. నకిలీ విత్తనాల ప్యాకెట్లకు… అసలు విత్తనాల ప్యాకెట్లకు ఏమాత్రం తేడా లేకపోవడంతో రైతులు ఏదీ అసలు… ఏదీ నకిలీ అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి వర్షాలు ప్రారంభం కాగానే పత్తి పంట సాగు చేస్తారు. పంట ఏపుగా రావడంతో బాగా దిగుబడి వస్తుందని గుడ్డిగా నమ్ముతున్నారు. రానురాను దిగుబడి అంతగా రాకపోవడంతో తాము సాగు చేసింది నకిలీ విత్తనాలు అని రైతులు గ్రహిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం కాస్త పూర్తి అవుతోంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో పత్తికి పెట్టింది పేరు. గత సంవత్సరం రంగారెడ్డి జిల్లాలో 3.10లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని అంచనా వేయగా కేవలం 1.31లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగయ్యింది. వికారాబాద్‌ జిల్లాలో కూడా సాధారణ సాగుతో పోలిస్తే సగమే పత్తి పంట సాగు చేశారు.

పక్క రాష్ట్రాలనుండి నకిలీ విత్తనాలు….

పక్క రాష్ట్రాలనుండి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం నుండి వికారాబాద్‌ జిల్లాతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లానుండి పెద్దఎత్తున నకిలీ విత్తనాలు హైదరాబాద్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రతిసారి రెండు రాష్ట్రాలనుండి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం బ్రేక్‌ పడటం లేదు. కోట్లాది రూపాయల నకిలీ విత్తనాలు సీజన్‌కు ముందే ప్యాకింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. యాసంగి సీజన్‌ సమయంలోనే నకిలీ విత్తనాలు ప్యాకింగ్‌ కేంద్రాలకు చేరిపోతున్నాయి. వానాకాలం సీజన్‌కు ముందే ప్యాకింగ్‌ పూర్తి చేసి ప్రాంతాల వారీగా రైతులకు చేరివేస్తున్నారు. ప్రతిసారి పట్టుబడటం వారిపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. మళ్లి సీజన్‌ ప్రారంభం కాగానే మళ్లి నకిలీ విత్తనాలు సరఫరా చేయడం మళ్లి దొరకడం మామూలైపోయింది. జూన్‌ మాసం కంటే వారం పదిరోజుల ముందే వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల హడావుడి ప్రారంభమవుతుంది. అంతకు ముందు పెద్దగా హడావుడి లేకపోవడంతో వ్యాపారులకు కలిసి వస్తుంది. పోలీసులు రోడ్లపైకి వచ్చి నకిలీ విత్తనాల విషయంలో కట్టుదిట్టమైన తనిఖీలు ప్రారంభించక ముందే తమ పనులు చేసుకుంటున్నారు. ప్రధాన రహదారుల గుండా నకిలీ విత్తనాలు ప్యాకింగ్‌ కేంద్రాలకు చేరిపోతున్నాయి. అక్కడ నకిలీకి…అసిలీకి ఏమాత్రం తేడా లేకుండా ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లకు తరలిస్తున్నారు. అసలు వ్యాపారులు సేఫ్‌గా బయటపడుతుండగా వాహనాల డ్రైవర్లు… వారి మనుషులు మాత్రమే పట్టుబడుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌లకు తరలిస్తున్నారు. నకిలీ విత్తనాలు ఎక్కడినుండి వస్తున్నాయనే విషయాన్ని గ్రహించి అక్కడ కట్టడి చేస్తే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా ఉంటాయి… ప్రతిసారి అలాగే జరుగుతోంది. కేవలం సీజన్‌ ముందు హడావుడి చేయడం కాకుండా క్రమం తప్పకుండా నకిలీ విత్తనాలపై దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది.

ప్యాకింగ్‌ల అడ్డా మేడ్చల్‌ గడ్డా…..

- Advertisement -

నకిలీ విత్తనాలు ప్యాకింగ్‌ చేయడంతో మేడ్చల్‌ కేంద్రంగా మారింది. ఇక్కడ రికార్డు స్థాయిలో గోదాములున్నాయి. ఆ గోదాముల్లో నకిలీ విత్తనాలను అసలు విత్తనాలుగా ప్యాకింగ్‌ చేయడంలో వారికి వారే సాటి. గోదాములతోపాటు ప్యాకింగ్‌ కేంద్రాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గోదాములను క్రమం తప్పకుండా తనిఖీలు చేయడంతోపాటు ప్యాకింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తే నకిలీ విత్తనాలను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలకు శ్రీకారం చుట్టినా అప్పటికే చాలా ప్రాంతాలకు నకిలీ విత్తనాలు చేరిపోయి ఉంటాయి…హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో గోదాములు, ప్యాకింగ్‌ కేంద్రాలు ఉండటంతో నకిలీ వ్యాపారులకు కలిసి వస్తోంది. ముందుగానే ప్యాకింగ్‌లు చేసి పెట్టుకోవడంతో తనిఖీల్లో కూడా బయటపడని పరిస్థితులు నెలకొన్నాయి….

టాస్క్‌ ఫోర్సు బృందాలకు శ్రీకారం….

నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు పోలీసులు, వ్యవసాయ శాఖ నడుం బిగించింది. ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాల కట్టడి విషయంలో పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపట్టనున్నారు. జిల్లా స్థాయిలో టీంలు ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు డివిజన్‌, మండల స్థాయిలో టీంలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టనున్నారు. ఒక డివిజన్‌ వ్యవసాయ శాఖ అధికారులు మరో డివిజన్‌ పరిధిలో ఫర్టిలైజర్స్‌ దుకాణాలను తనిఖీలు చేయనున్నారు. స్థానిక అధికారులు తనిఖీలు చేయడం ద్వారా వత్తిడీలు వచ్చే అవకాశం ఉంటుుంది. దీంతో పక్క డివిజన్‌ అధికారుల ద్వారా తనిఖీలు చేపట్టనున్నారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక సీఐ మండల పరిధిలో ఉన్న ఎరువులు, విత్తనాల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టనున్నారు.

గతసారి 18 కేసులు…రూ.3కోట్ల విలువైన విత్తనాలు స్వాధీనం….

గత వానాకాలం సీజన్‌లో జిల్లా పరిధిలో ఏకంగా 18 కేసులు నమోదు చేశారు. దీంతో రూ. 3కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్‌ నుండి హైదరాబాద్‌కు వాహనాల్లో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ పట్టుపడ్డారు. వీటి విలువే రూ. 2.50కోట్లు..కర్నూల్‌ నుండి నకిలీ విత్తనాలతో వస్తున్న డీసీఎం ను శంషాబాద్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ సీజన్‌లో అదే పెద్ద కేసు. కర్ణాటక రాష్ట్రం నుండి హైదరాబాద్‌ బీజాపూర్‌ రహదారి గుండా….కర్నూల్‌ నుండి హైదరాబాద్‌ బెంగుళూరు జాతీయ రహదారి గుండా నకిలీ విత్తనాలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. అందులో భాగంగానే వాహనాల్లో నకిలీ విత్తనాలు రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. గతసారి మాదిరిగానే ఈసారి కూడా పెద్దఎత్తున తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఇందులో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఎంతమేర విజయం సాధిస్తారో వేచి చూడాలి….

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement