న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖ ఉక్కు కర్మాగారానికి (ఆర్‌ఐఎన్‌ఎల్) తగినంత బొగ్గు సరఫరా, పెట్టుబడి సమస్యలను అధిగమించడానికి అవసరమైన క్రెడిట్ సౌకర్యం కల్పించవలసినదిగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌గా ప్రసిద్ధి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( ఆర్‌ఐఎన్‌ఎల్ ) దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని లేఖలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గును భారత్ కోల్ లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి తగినంత బొగ్గు సరఫరా లేకపోవడం వల్ల ఆర్‌ఐఎన్‌ఎల్ పూర్తి సామర్థ్యంతో పని చేయలేకపోతోందని జీవీఎల్ వివరించారు.
ముడిసరుకు ధరలు పెరగడం, ప్రతికూల అననుకూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఆర్‌ఐఎన్‌ఎల్ తీవ్ర వర్కింగ్ క్యాపిటల్ సమస్యను ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బొగ్గు అవసరాల కోసం క్రెడిట్ సౌకర్యాన్ని అందించడం లేదని కేంద్రమంత్రికి వివరించారు. ఈ సమస్యలపై ఇప్పటికే ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో చర్చించగా ఆయన ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్‌కి లేఖ రాశారని ప్రహ్లాద్ జోషీకి తెలిపారు. దీనిపై స్పందించి ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బొగ్గును అందించాలని, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలను అధిగమించడానికి తగిన క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన అభ్యర్థించారు.