భారత్ లో రేపు (సోమవారం) ‘సూపర్ బ్లూ మూన్’ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని నాసా పేర్కొంది.
అయితే, ఈ సారి మాత్రం సూపర్ మూన్, బ్లూ మూన్ కలయికలో సూపర్ బ్లూ మూన్ దర్శనం ఇవ్వబోతున్నది. ఈ సూపర్ మూన్ నేటి ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడొచ్చని పేర్కొంది. అయితే, మంగళవారం ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా వివరించింది.
ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా… భారత్ లో ఆగస్టు 19 రాత్రి నుంచి ఆగస్టు 20 ఉదయం వరకు కనిపిస్తుంది. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే, సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడు.