వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కన్నా అత్యధికంగా నమోదువుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ ”బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు పలు చోట్ల ఎక్కువ రోజులపాటు వేడి గాలులు వీస్తాయి” అని తెలిపారు.
వాతావరణ మార్పుతో భౌగోళికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అది తీవ్రమైన వాతావరణ విపత్తులకు కారణమవుతున్నదని ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. 1901 నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది ఫిబ్రవరి మాసం అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసుకుందని తెలిపాయి. పశ్చిమాన వాతావరణంలో ఐదు పటిష్టమైన వాటితో పాటుగా చోటు చేసుకున్న మార్పులతో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు కావడంతో మార్చిలో ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయని వెల్లడించాయి.
అలాగే వచ్చే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలివానలు సంభవించే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని ఐఎండీ వర్గాలు తెలిపాయి. వర్షకాలం రాకముందే ఎక్కువకాలం ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు, ఉరుములతో కూడిన గాలివానలు, వడగండ్లవానలు, పిడుగులు పడిన కారణంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో అనేక చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి. దేశంలో వాయవ్య ప్రాంతం, ద్వీపకల్ప సంబంధిత ప్రాంతాలను మినహాయించి అనేక చోట్ల ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ ఈ నెల మొదట్లో సూచించింది.