Tuesday, November 26, 2024

Sunitha Filed – అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిష‌న్ – విచార‌ణ‌ సెప్టెంబ‌ర్ రెండో వారానికి వాయిదా

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ రెండో వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంతో పాటు తాజా ఛార్జిషీట్ కాపీని దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అసలు కేసు ఫైల్‌ కాపీలను సీల్డ్ కవర్‌లో అందించాలని కూడా సూచించింది.

ఇదిలాఉంటే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై అతడి తరఫున సీనియర్‌ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని.. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌నూ.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌తో పాటే వింటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది హత్య కేసు. మీరు వేచి ఉండాలి…మేము పరిశీలిస్తాము. ఇవి కలిసి వినవలసి ఉంటుంది’’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇక, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఈ రెండు పిటిషన్లపై సెప్టెంబర్ రెండో వారంలో విచారణ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement