హైదరాబాద్, ఆంధ్రప్రభ: జేఎన్టీయు పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు వేసవి సెలవులను వర్సిటీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు రెండు వారాలపాటు వేసవి సెలవులను ఇచ్చింది. ఈనెల 15 నుంచి 29 వరకు సెలవులను ఇస్తున్నట్లు జేఎన్టీయు రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. 30 నుంచి తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రరంభమవడంతో తొలుత వేసవి సెలవులు లేకుండానే అకడమిక్ క్యాలెండర్‌ను వర్సిటీ ప్రకటించింది.
ఎండల తీవ్రత బాగా పెరగడంతో తాజాగా విద్యాసంవత్సరంలో వర్సిటీ అధికారులు మార్పులు చేశారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 30 నుంచి ప్రారంభమై జూన్ నెల 11 వరకు జరగనున్నాయి. జూన్ 13 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించి పరీక్షలు ఆగస్టు 24 నుంచి జరగనున్నాయి. ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ తరగతులు ఆగస్టు 17 నుంచి, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 26 నుంచి జరగనున్నాయి.
ఎంసెట్ దరఖాస్తులు 1.67 లక్షలు…
తెలంగాణ ఎంసెట్-2022కు రాష్ట్ర వ్యాప్తంగా 1,67,899 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,07,056 దరఖాస్తులు రాగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 60,843 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..