హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే రెండు, మూడు రోజుల్లో వేసవి తాపం మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్కడి వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో రాష్ట్ర ప్రజలు ఉడికిపోతుంటే మరో రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మార్చి నెల మొదటి వారంలోనే రాష్ట్రంలో ఎండవేడిమి పెరిగింది. మొదటి రెండో వారాల్లో ఉష్ణోగ్రత పెరిగినా.. నెల చివరిలో మాత్రం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వచ్చే రెండు, మూడు రోజుల్లో మరో 3 డిగ్రీల వరకు వేడి పెరగవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
భానుడి ప్రతాపం ఇప్పుడే తీవ్రతరం కావడంతో ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అత్యధిక ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకే సూరీడు ప్రజలను గడగడలాడిస్తున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మంట పుట్టిస్తున్నాడు. పాఠశాలలు, కార్యాలయాల్లోని ఉద్యోగులు, దుకాణాల్లోని వ్యాపారులు ఎండవేడిమితో సతమతమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..