ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : ఎండలు పెరిగిపోతున్నాయి.. కొద్దిసేపు ఎండలో ఉంటే గొంతు ఎండిపోతోంది.. ఇలాంటి తరుణంలో మద్యం ప్రియులు మాత్రం చల్లటి బీర్లు తాగేందుకు మొగ్గుచూపుతున్నారు. వేసే సీజన్లలో లిక్కర్ తాగే వాళ్లు ఎండల నేపథ్యంలో మాత్రం బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువమంది బీర్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.. ఈ వేసవి సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. లిక్కర్‌తో పోలిస్తే బీర్ల అమ్మకాలు నెలనెల పెరిగిపోతున్నాయి. బీర్ల అమ్మకాలు దాదాపుగా మరో రెండు మాసాలపాటు కొనసాగనుంది. బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. ప్రతినెల విక్రయాలు పెరిగిపోతున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కూడా బీర్ల అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవి నేపథ్యంలో చిల్డ్ బీర్ల వైపు మద్యం ప్రియులు మొగ్గు చూపుతున్నారు.
ఎండలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. గత పదిహేను రోజులుగా ఎండలు 40 డిగ్రీల పైమాటే. ఇలాంటి తరుణంలో ఇళ్లనుండి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా ఎండ దెబ్బకు చల్లటి బీర్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్రమం తప్పకుండా లిక్కర్ తీసుకునే చాలామంది మద్యం ప్రియులు ఈసారి మాత్రం చల్లటి బీర్లు తాగుతున్నారు. కడుపులో చల్లదనాన్ని ఇస్తుండటంతో బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతసారితో పోలిస్తే ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటే బీర్లఅమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. శివారు ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంత వైన్స్‌ల్లో కూడా చల్లటి బీర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువమంది మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో వైన్స్ యజమానులు బీర్లు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేస్తున్నారు. అందులో చిల్డ్ బీర్లకే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కాస్త వేడిగా ఉంటే మాత్రం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వైన్స్ యజమానులు కొత్తగా రిఫ్రిజ్‌లేటర్లు కొనుగోలు చేసి అందులో బీర్లు నిల్వ ఉంచుతున్నారు.వేసవి ప్రారంభమైనప్పటినుండి బీర్ల అమ్మకాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతున్నాయి.
అమ్మకాల్లో రంగారెడ్డి టాప్..
మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లాలో టాప్‌లో నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక విక్రయాలు ఇక్కడే జరుగుతుండటం గమనార్హం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 495 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో సగానికి పైగా శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. శివార్లలో ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికితోడు రికార్డు స్థాయిలో సాప్ట్ వేర్ కంపనీలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో చాలామంది మద్యం ప్రియులు ఉండటంతో అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈవేసవి సీజన్‌లో రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ జిల్లా రెండవ స్థానం….మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండు ఎక్సైజ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో శంషాబాద్ డివిజన్ పరిధిలో 100మద్యం దుకాణాలుండగా సరూర్‌నగర్ డివిజన్‌లో 133 ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ డివిజన్‌లో 144, మల్కాజ్‌గిరి డివిజన్ పరిధిలో 88 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో కొన్ని మినహా మిగతా వన్నీ కూడా శివారు ప్రాంతాలకు చెందినవే కావడంతో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
నెలనెల పెరుగుతున్న అమ్మకాలు..
వేసవి నేపథ్యంలో జిల్లాలో బీర్ల అమ్మకాలు నెలనెల పెరుగుతున్నాయి. జనవరినుండి బీర్ల అమ్మకాలు పెరిగిపోయాయి. ఎండలు ముదిరినట్లే అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. జనవరి మాసంలో రంగారెడ్డి జిల్లాలో 8,36,907 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. మేడ్చల్ జిల్లాలో 1,34,468కేసుల బీర్లు అమ్మారు. ఫిబ్రవరి మాసంలో 9.34లక్షల కేసులు రంగారెడ్డి జిల్లాలో విక్రయాలు చేయగా మేడ్చల్‌లో 1.46లక్షల కేసులు అమ్మారు. మార్చి మాసంలో 10.77లక్షల కేసులు, మేడ్చల్‌లో 1.63లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత మాసానికి సంబంధించి ఇప్పటికే 5.59లక్షల బీర్ల కేసులు అమ్మారు. మేడ్చల్‌లో 93వేల కేసుల బీర్లు అమ్మారు. ప్రస్తుత మాసంతోపాటు మే, జూన్ మాసాల్లో కూడా బీర్ల అమ్మకాల జోరు కొనసాగనుంది. జూన్‌లో వర్షాలు ప్రారంభమై వాతావరణం చల్లబడేంత వరకు బీర్ల అమ్మకాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ఈసారి వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.