కోవిడ్ దెబ్బకు కుదేలైన విమానయాన రంగం దాదాపు పూర్వస్థితికి వచ్చింది. సాధారణంగా వేసవిలో చాలా మంది ప్రత్యేకంగా హాలీడే టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. దీంతో ఈ సారి వేసవిలో డిమాండ్ బాగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంత భారీగా విమాన ఛార్జీలను సంస్థలు పెంచాయి. ఢిల్లి ఉంచి లేహాకు విమాన ఛార్జీ 52 వేలకు పెరిగింది. ఇలానే చాలా రూట్లలో గతం కంటే మూడు రేట్లకు పైగా విమాన ఛార్జీలు పెరిగాయి. మే 3 నుంచి గోఫస్ట్ విమాన సర్వీస్‌లు రద్దు కావడంతో ఇది మరింతగా పెరిగాయి. గోఫస్ట్ సర్వీస్‌లు నడిచే రూట్లలో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. విమాన ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ విధించకపోవడంతో పలు విమానయాన సంస్థలు డిమాండ్‌ను బాగా క్యాష్ చేసుకుంటున్నాయి.
గోఫస్ట్ సర్వీస్‌లు నడిచే 315 రూట్స్‌లో డిమాండ్ పెరిగిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా చెప్పారు. దీనివల్ల ఛార్జీలు పెరిగాయన్నారు. విమాన ఛార్జీలు పూర్తిగా మార్కెట్ ఆధిరితంగానే ఉంటాయని వీటిని ప్రభుత్వం నియంత్రించాలని భావించడంలేదన్నారు. ప్రధానంగా గోఫస్ట్ సర్వీస్‌లు బాగా డిమాండ్ ఉన్న హాలీడే ప్రదేశాలైన గోవా, లేహా రూట్లలో సర్వీస్‌లను నడుపుతోంది. పూణే, అహ్మదాబాద్ రూట్లలోనూ దీని ప్రభావం ఉందని విమానయాన రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోఫస్ట్ ఢిల్లి నుంచి శ్రీనగర్‌కు 199 సర్వీస్‌లు, ఢిల్లి నుంచి లేహాకు 182 సర్వీస్‌లు, ముంబై నుంచి గోవాకు 156 సర్వీస్‌లను నడుపుతోంది.
ఢిల్లి-లేహా రూట్‌లో ఛార్జీలు 125 శాతం పెరిగాయి. ఢిల్లి-శ్రీనగర్ రూట్‌లో ఛార్జీలు 86 శాతం పెరిగాయి. గోఫస్ట్‌కు విమానయాన రంగంలో 7 శాతం వాటా ఉంది. దీన్ని పూరించేందుకు పలు సంస్థలు సర్వీస్‌లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. గోఫస్ట్ కూడా తాము సర్వీస్‌లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీసీఏకి పునరుద్ధరణ ప్రణాళిక సమర్పించింది. ఇది ఆమోదం పొందితే విమాన ఛార్జీలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లి-శ్రీగర్, ఢిల్లి- లేహా రూట్ ఎయిర్ ఇండియా సర్వీస్‌లు పెంచింది. ముంబై నుంచి ఇండిగో సర్వీస్‌లను పెంచింది విస్తారా ఎయిర్‌లైన్స్ ఢిల్లి-ముంబై రూట్‌లో సర్వీస్‌లను పెంచింది. విమాన ప్రయాణికులు బారీగా పెరుగుతున్నందున విమానయాన సంస్థలు ఈ ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 115 విమానాలను ప్రవేశపెట్టనున్నాయి. కొత్త విమానాలను ప్రధానంగా ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆర్డర్లు ఇచ్చాయి. ఇండిగో ఈ ఈ ఆర్ధిక సంవత్సరంలో 45-50 విమానాలను ప్రవేశపెట్టనుంది.