Friday, November 22, 2024

Delhi | టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో 15 కోట్లు ఇచ్చా.. జైల్ నుంచి సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో అరుణ్ పిళ్ళైకి రూ. 15 కోట్లు అందజేశానని సుకేశ్ చంద్రశేఖర్ వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుకేశ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా విడుదల చేసిన మరో లేఖలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) నేతల ప్రస్తావన తీసుకొచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు రూ. 15 కోట్లు హైదరాబాద్‌లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) కార్యాలయంలో ఇచ్చానంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ డబ్బు అందినట్టు టీఆర్ఎస్ నేత చేసిన చాట్ స్క్రీన్ షాట్లు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. తన స్వదస్తూరీతో రాసిన లేఖను న్యాయవాదుల ద్వారా మీడియా సంస్థలకు విడుదల చేసిన సుకేశ్ చంద్రశేఖర్… తనతో జరిపిన చాటింగ్ ‘సౌత్ గ్రూపు’లో ఉన్న టీఆర్ఎస్ నేతతో కేజ్రీవాల్‌కు ఉన్న సంబంధాలను బయటపెడుతోందని అన్నారు.

ఆ టీఆర్ఎస్ నేత ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. తన సహాయకుడు ఏపీ (అరుణ్ పిళ్ళై)కి రూ. 15 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆ టీఆర్ఎస్ నేత చాట్‌లో స్పష్టంగా చెప్పారని, రూ. 15 కోట్లను 15 కేజీల నెయ్యిగా పేర్కొన్నారని సుకేశ్ తెలిపారు. తన దగ్గర నుంచి క్యాష్ బాక్సులను తీసుకున్న పిళ్ళై వాటిని నలుపు రంగు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ (రిజిస్ట్రేషన్ నెంబర్ 6060)లో పెట్టారని చెప్పారు. ఆ కారు విండ్‌షీల్డ్‌పై ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ కూడా ఉందని తెలిపారు.

ఆ సమయానికి ఆ కారు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పార్కింగ్ ప్రాంతంలో ఉందని అన్నారు. చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ – టీఆర్ఎస్ మధ్య ఉన్న ఆర్థిక, వ్యాపార బంధాలు స్పష్టమవుతున్నాయని, ఇప్పుడు విడుదల చేస్తున్న చాట్ స్క్రీన్ షాట్లు కేవలం స్టార్టర్లు మాత్రమేనని, అసలు కథ ఇంకా చాలా ఉందని వెల్లడించారు. తాను మాట్లాడే ప్రతి మాటకు తన దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే నార్కో అనాలిసిస్, పాలీగ్రాఫ్ టెస్టులను ఎదుర్కోడానికి కూడా తాను సిద్ధమని సుకేశ్ చంద్రశేఖర్ అన్నారు. కేజ్రీవాల్ అవినీతి బండారం మొత్తం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement