న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ. రామారావు కేంద్రానికి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మధ్యాహ్నం కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సమావేశమయ్యారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో ఉన్న అభివృద్ధి అవకాశాలపై కేంద్ర మంత్రితో మంత్రి కేటీఆర్ చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను తాము సిద్ధం చేశామని, ఇంకా మెరుగైన వాతావరణం సృష్టించడం కోసం నిరంతరంగా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో నైపుణ్యం కల్గిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరినట్టు సమాచారం. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ట్విట్టర్లో ఫొటోలను పోస్టు చేసిన మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రితో చర్చ సహృద్భావ వాతావరణంలో సానుకూలంగా సాగిందని తెలిపారు. ఈ భేటీలో మంత్రి కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, సురేశ్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఉన్నారు.
వివాహ వేడుక కోసం…
మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణం తన శాఖలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి వివాహ వేడుకేనని తెలుస్తోంది. ఆ వివాహానికి హజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన, పనిలోపనిగా కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సమావేశమైనట్టు సమాచారం. అయితే ఆయన ఢిల్లీ పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.