కోటా: రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి… ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న మరో విద్యార్థి గత రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 20కి చేరింది. ఈ నెలలో ఇది నాలుగోది కావడం ఆందోళన కలిగించే అంశం.
వివరాలలోకి వెళితే ….బిహార్ లోని గయ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల వాల్మీకి జాంగి జినీరింగ్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నాడు. దానికోసం గత ఏడాది కోటా లోని శిక్షణా కేంద్రంలో చేరాడు. ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోన్న అతడు.. మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి మృతికి గత కారణాలు తెలియాల్సి ఉంది. వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటా లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 20కి చేరడం గమనార్హం. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.