పాకిస్తాన్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది సైనికులు చనిపోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ మోటార్‌సైకిల్‌పై ఎదురు వెళ్లినట్టు భద్రతా అధికారులు తెలిపారు. ఘటనపై పాకిస్తాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు.
”కెపికెలోని బన్నూ డివిజన్‌లో 9 మంది వీర సైనికులను కోల్పోయిన పిరికి ఉగ్రవాద చర్యకు నా గుండె పగిలింది. అలాంటి చర్యలను ఖండిస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ దృఢంగా ఉంది” అని అన్వర్ ఉల్ హక్ కకర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 30వతేదీన ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు.