Friday, November 22, 2024

Delhi | దేశంలో తగినంత చక్కెర నిల్వలు.. ప్రపంచంలో భారత్‌లోనే తక్కువ ధరలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో చక్కెర నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రపంచంలో చక్కెర ధరలను పరిశీలిస్తే భారత్‌లోనే తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం ప్రస్తుత చక్కెర సీజన్ (2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్)లో మొత్తం చక్కెర 373 లక్షల మెట్రిక్ టన్నులు దాటి చక్కెర ఉత్పత్తయిందని, అందులో 43 లక్షల మెట్రిక్ టన్నులు ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించినట్టు వెల్లడించింది. మిగతా 330 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ప్రజా అవసరాల కోసం సిద్ధంగా ఉందని తెలిపింది. గత ఐదేళ్లలో రెండోసారి అత్యధిక ఉత్పత్తి జరిగిందని కేంద్రం వెల్లడించింది.

దేశీయ అవసరాలు, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు చెరకు రైతులకు సమయానికి చెల్లింపులు జరిపేలా చేయడం కోసం చక్కెర ఎగుమతిని 61 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేసినట్టు కేంద్రం తెలిపింది. ఫలితంగా 2023 ఆగస్టు చివరి నాటికి సుమారు 83 లక్షల చక్కరె నిల్వలు మార్కెట్లో ఉన్నాయని పేర్కొంది. ఈ నిల్వలు 3 నెలల అవసరాలకు సరిపోతాయని తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక సహా చెరకు సాగు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో రుతు పవనాలు సాధారణంగా ఉన్నాయని, ఫలితంగా 2023-24 చక్కెర సీజన్‌లో ఉత్పత్తి కూడా సమృద్ధిగానే ఉంటుందని అంచనా వేస్తోంది.

అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో కేన్ కమిషనర్లను పంటల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చెరకు సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించినట్టు కేంద్రం తెలిపింది. తద్వారా చక్కెర ఎగుమతి పరిమితులను సవరించడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ అవసరాలు, ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించగా మిగిలిన చక్కెర నిల్వలను మాత్రమే ఎగుమతికి అనుమతిస్తూ.. దేశంలో చక్కెర నిల్వలు తగ్గకుండా చూసుకుంటోంది. డిమాండ్‌కి తగిన నిల్వలు లేనప్పుడే ధరలు పెరుగుతాయి కాబట్టి, ధరల పెరుగుదలకు ఆస్కారం లేకుండా తగినంత నిల్వ ఉండేలా చర్యలు చేపట్టింది.

- Advertisement -

మరోవైపు అంతర్జాతీయంగా భారత చక్కెరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ రాయితీలను పరిగణలోకి తీసుకోకపోయినా సరే భారత్‌లో చక్కెర ఉత్పత్తి చవకగా సాగుతోంది. ప్రభుత్వం మరియు పరిశ్రమల సమిష్టి ప్రయత్నాల ఫలితంగా రూ. 1.07 కోట్లకు పైగా (ప్రస్తుత సీజన్‌లో చెరకు బకాయిల్లో 94%) మిల్లులు ఇప్పటికే చెల్లించాయని కేంద్రం తెలిపింది. తద్వారా చక్కెర రంగం పట్ల రైతుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement